పంతం మనిషిని గొప్పవాడిగా మార్చుతుంది. అనుకున్నది సాధించే సత్తాను ఇస్తుంది. కాని అదే పంతం మనిషిని మూర్ఖుడిగా కూడా మార్చి వినాశనానికి దారితీస్తుంది. తాను అనుకున్నదే చెల్లాలనే పంతం అతడితో పాటు అతడి మొత్తం కుటుంబానికి శాపమైంది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తార్నాక డెత్ మిస్టరీకి కారణం. తాను అనుకున్నది జరగకపోయే సరికి నరరూప రాక్షసుడిలా మారిన అతడు అల్లారుముద్దుగా పెంచి ప్రయోజకుడిని చేసిన తల్లితో పాటు భార్యా బిడ్డలను కాటికి చేర్చాడు. చివరికి తాను మృత్యు ఒడిలోకి చేరాడు.
తార్నాక రూపాలి అపార్ట్ మెంట్లో నలుగురు మృతి చెందిన ఘటనలో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే వాస్తవాలివే. నిందితుడు విజయ్ ప్రతాప్ తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో అతడి తల్లి జయతి అతన్ని చాలా గారాబంగా పెంచింది. అడిగింది కాదనకుండా ఇచ్చింది. అతడే లోకంగా బతికింది. అయితే ఈ గారాబమే విజయ్ ను మొండివాడిని చేసింది. తాను అనుకున్నదే సాగాలి.. తాను అనుకున్నదే జరగాలి అన్నంతగా పంతానికి విజయ్ దిగేవాడు. అయితే మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడడంతో అతని దగ్గరి బంధువు సింధూరతో అతనికి వివాహం జరిగింది. వాళ్లకు నాలుగేళ్ల ఆద్య అనే పాప కూడా ఉంది.
కాని విజయ్ బిహేవియర్ కారణంగా వాళ్ల మధ్య మనస్పర్థలు బాగా పెరిగాయి. చివరికి విజయ్ తో ఆమె కన్నతల్లి కూడా విసిగిపోయింది. చెన్నైలో ఓ కార్ల కంపెనీలో డిజైనర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విజయ్ ను అక్కడే వదిలేసి.. ఆయన తల్లి కోడలు, మనవరాలితో హైదరాబాద్ లోని తార్నాకకు షిఫ్ట్ అయ్యింది. కోడలు సింధూర ఓ ప్రైవేట్ బ్యాంక్ లో విధి నిర్వహణలో వచ్చిన గుర్తింపుతో మేనేజర్ స్థాయికి ఎదిగింది. విజయ్ వీక్ ఎండ్ లో హైదరాబాద్ కు వచ్చి వెళుతుండే వాడు. అయితే ఈ క్రమంలో చెన్నైకి వీళ్లను కూడా షిఫ్ట్ కావాలని ఈ మధ్య ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. వారు దానికి ససేమిరా అనడంతో..కోపంతో రగిలిపోయాడు. చెన్నై నుంచి తార్నాకకు వచ్చిన సింధూరతో గొడవకు దిగాడు. ఆదివారం అర్థరాత్రి భార్య సింధూరకు విషం ఇచ్చాడు.
తరువాత తల్లి ముఖం పై దిండు అదిమి ఊపిరాడకుండా చేశాడు. కుమార్తె మెడకు కరెంట్ తీగ బిగించి హత్య చేశాడు. ముగ్గురు మరణించారని నిర్థారణకు వచ్చాక ప్రతాప్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలో సింధూర కడుపులో విషయం ఉన్నట్టు నిర్ధారించారు. దీన్ని బట్టి పోలీసులు అంచనాకు వచ్చారు.