వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ మృతికి రాష్ట్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మృతుని కుటుంబానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని ఆరోపించారు. శ్రీనివాస్ మృతికి బాధ్యత వహిస్తూ.. వెంటనే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు ప్రవీణ్.
వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ.. కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.
కాగా.. ఇటీవల ఐసీయూలోకి ఎలుకలు ప్రవేశించి.. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ కాళ్లు, చేతుల వేళ్లను దారుణంగా కొరికాయి. దీంతో తీవ్ర రక్త శ్రావం కావడంతో శ్రీనివాస్ పరిస్థితి విషమించింది. మెరుగైన చికిత్స కోసం అతన్ని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
దీంతో.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే శ్రీనివాస్ మృతికి కారణం అని బాధితుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే.. చికిత్సకు సహకరించక పోవడంతో శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీనివాస్.. మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.