పెళ్లంటే.. ఆ కుటుంబంలో వారం రోజుల పాటు సందడి వాతావరణం ఏర్పడుతుంది. బందువులతో ఇళ్లంతా కళకళలాడుతుంది. రంగురంగుల తోరణాలతో ఇళ్లంతా సందడిగా సనిపిస్తోంది. ఖరీదైన బట్టలు, నగలతో మహిళలు ముస్తాబవుతారు. ఇక పెళ్లికూతురికైతే ఒంటినిండా ఆభరణాలు ధరింపచేస్తారు.
కానీ కేరళకు చెందిన ఓ వధువు నగలు వేసుకోకుండానే వివాహం చేసుకుంది. వాటికి అయ్యే ఖర్చును వృధా చేయకూడదని నిర్ణయించుకుంది. ఆ డబ్బులతో పేదలకు సహాయం చేసింది. తినడానికి తిండి కూడా లేని పేదవారికి అందజేసి దయా హృదయాన్ని చాటుకుంది. వధూవరులు సాధారణంగా వివాహం చేసుకున్నారు.
అయితే.. కోజికోడ్, మయపయ్యూర్ కు చెందిన అంత్రు, రంలా దంపతుల కుమార్తె షెహ్నా షెరి. కొట్టపల్లికి చెందిన మహమ్మద్ షఫీతో పెళ్లి నిశ్చయమైంది. షెహ్నా తన వివాహాన్ని సాధారణంగా జరుపుకుని మిగిలిన డబ్బులను పేదలకు సహాయం చేయాలనుకుంది. ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు, వరుడు కూడా అంగీకరించారు. దీంతో నిరాడంబరంగా పెళ్లితంతు ముగించారు.
21 సెంట్ల భూమిని నిరుపేదలైన నాలుగు కుటుంబాలకు ఇచ్చారు. దగ్గరిలోని డయాలసిస్ సెంటర్ కు డబ్బులను దానంగా ఇచ్చారు. ఓ పేద వ్యక్తికి ఇంటిని నిర్మించారు. మరో వ్యక్తి ఆస్పత్రి చికిత్సకు డబ్బును సహాయం చేశారు. ఓ పేద అమ్మాయి వివాహ ఖర్చును భరించారు. వీరి నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.