భాగ్యనగర్ ప్రజలకు మళ్లీ ట్రాఫిక్ కష్టాలు తప్పేట్టుగా లేవు. రానున్న పది రోజులు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు మరింతగా పెరగనున్నాయి. సమీప ప్రాంతాల్లో ముఖ్యమైన పలు ఈవెంట్ల ఫలితంగా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించడం వల్ల ఇరుకు రోడ్లలో చిక్కుకుపోయి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే గత మూడు రోజులుగా నగర ప్రజలను ట్రాఫిక్ ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నాయి. కాగా..మంగళ,బుధవారాలు ట్రాఫిక్ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు మెయిన్ రోడ్లు, వీధులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. అంతే కాకుండా..శాసన సభ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి అసెంబ్లీ మార్గంలో ఆంక్షలు ఉన్నాయి.
దీనితో పాటు ఈ నెల 11 న ఫార్ములా ఈ రేసింగ్, 15 వరకు నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్, 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలున్నాయి. ఇక రానున్న 18వ తేదీన శివరాత్రి వేడుకలున్నాయి. ఈ నేపథ్యంలో మరో పది రోజుల పాటు ట్రాఫిక్ సమస్యలు ఎదురు కానున్నాయి. కాగా వాహనదారులకు చుక్కలు తప్పేట్టుగా లేవు.
అయితే షిఫ్టుల వారీగా ట్రాఫిక్ పోలీసులు 24 గంటలు విధుల్లో ఉన్నప్పటికీ ఫలితం ఉడడం లేదు. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై ప్రతిరోజూ సుమారు 17 వేల చలానాలు నమోదవుతుంటాయి. కాగా అధిక శాతం నో పార్కింగ్, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, అధిక వేగం, మైనర్ల డ్రైవింగ్, లెసెన్స్ లేని వారే ఉంటున్నారు.