ఆస్తులకోసం అన్నదమ్ములే చంపుకునే ఈ రోజుల్లో.. తన ఆస్తినంతా ఓ రాజకీయ నేత పేరుమీద రాసింది ఓ వృద్దురాలు. అది ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ కు చెందిన 78 ఏళ్ల పుష్ప ముంజియల్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటే అమితమైన అభిమానం.
ఆ అభిమానాన్ని మాటల్లోనే చూపించకుండా.. తనకున్న ఆస్తులన్నంటినీ రాహుల్ పేరు మీద రాసి వినూత్న రీతిలో చాటుకున్నారాబామ్మ. ఆయన సిద్ధాంతాలు నచ్చిన ఆమె.. తన పేరు మీదున్న 50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం రాహుల్ గాంధీకి చెందేలా వీలునామా రాశారు. అందుకు సంబంధించిన పత్రాలను సోమవారం పీసీసీ మాజీ చీఫ్ ప్రీతమ్ సింగ్ కు అందజేశారు.
ఆయన అవసరం ఇప్పుడు దేశానికి ఎంతగానో ఉందని ఆమె పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాహుల్ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని కొనియాడారు. ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాహుల్ మీదున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకునే అవకాశం వచ్చిదంటూ ఆనందభాష్పాలు రాల్చారు బామ్మ.
Advertisements
తన మరణానంతరం ఆ ఆస్తులన్నీ రాహుల్ కే చెందేలా నిర్ణయించాని కోరుతూ కోర్టుకు సైతం వీలునామాను సమర్పించుకున్నారు. పార్టీ అవసరాలకు, దేశ అభివృద్ధికే కాకుండా తన సొంత అవసరాలకు సైతం వాటిని వాడుకోవచ్చని వీలునామాలో పేర్కొంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత బామ్మను అభినందించారు. బామ్మ అభిమానానికి రాహుల్ సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు.