గోవులమీదున్న ప్రేమతో వాటిని సాదుకుంటున్న ఓ యాచకురాలికి చెందిన గోవులను మున్సిపల్ అధికారులు గోశాలకు తరలించారు. దీంతో తనను బెదిరించి తన ఆవులను తోలుకుపోయారని జిల్లా కలెక్టర్ కారుకు అడ్డం తిరిగింది ఓ వృద్ధురాలు. తన ఆవులను తనకు ఇప్పించాలని వేడుకుంది. ఈ ఘటన ఒడిశాలోని సోనేపూర్ జిల్లాలో జరిగింది.
తరాష్ బాగ్ అనే వృద్ధురాలు యాచకురాలిగా జీవనం సాగిస్తోంది. ఆమెకు ఉండటానికి ఇళ్లు లేకపోవడంతో సోనేపూర్ జిల్లా దవాఖాన ఆవరణలో తలదాచుకుంటోంది. రోజూ యాచనతో వచ్చిన డబ్బులో తన ఖర్చులు పోగా మిగిలిన పైకంతో నాలుగు ఆవులను కొనుగోలు చేసి.. వాటి ఆలనా పాలన చూసుకుంటుంది. అయితే.. అవి రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుండటంతో మున్సిపల్ అధికారులు వాటిని గోశాలకు తరలించారు.
ఆవుల కోసం మున్సిపల్ అధికారుల చుట్టూ ఎంత తిరిగినా లాభం లేకుండా పోయింది. దీంతో తానుంటున్న దవాఖాన పక్కనే ఉన్న జిల్లా కలెక్టరేట్ కు వెళ్లింది ఆ వృద్దురాలు. విధుల్లో భాగాంగా బయటకు వెళ్తున్న జిల్లా కలెక్టర్ సునీల్ నరవణే కారుముందు పడుకుంది. తన ఆవులను ఇప్పించాలని అర్ధించింది. వాటిని తిరిగి ఇప్పిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
పోట్టకూటి కోసం యాచననే వృత్తిగా ఎంచుకున్న ఆమె.. మూగ జీవాలపై పెంచుకున్న అభిమానానికి ఇది నిదర్శనంగా నిలిచిందని పలువురు అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ యాచకురాలు అయినప్పటికీ.. .జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లే దైర్యం చేసిందని కొందరు కామెంట్ లు పెడుతున్నారు.