మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలు నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి బీజేపీయేతర ప్రతిపక్షాల సీఎంలు హాజరు కావడం లేదు. ఏపీ,ఒడిసా సీఎంలు మాత్రమే ఈ మీటింగ్ కు హాజరవుతున్నారు.
ఇక ఈ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని ముందుగా బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించినా చివరికి ఆయన కూడా వెళ్లడం లేదు. కాగా, పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంతో పాటు నీతి ఆయోగ్ కౌన్సిల్ మీటింగ్ ను కూడా బహిష్కరిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. మరో వైపు ఈ రెండు కార్యక్రమాలను బీఆర్ఎస్ కూడా బహిష్కరించింది.
అయితే ప్రధాని మోడీ ప్రభుత్వం విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలే కాకుండా..యూపీఎ భాగస్వామ్య పార్టీల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బహిష్కరించారు. ఈ మేరకు ఆయన మోడీకి శుక్రవారం రెండు పేజీల లెటర్ రాశారు. ప్రధాని సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండకపోతే.. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.
కో ఆపరేటివ్ ఫెడరలిజం ఒక జోక్ అయినప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం ఎందుకని ఆ లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ముందుగా ఈ సమావేశానికి హాజరై తర్వాత ప్రతిపక్షాల నేతలను కలుసుకోవాలని మమత బెనర్జీ అనుకున్నారు. చివరికి ఆమె కూడా ఈ మీటింగ్ ను బహిష్కరించారు.