దేశ వారసత్వ సంపదను, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. మమ్మీ, డాడీ సంస్కృతి పోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలను బట్టలిప్పి బతుకమ్మలాడించిన నిజాం రాజు సమాధి వద్ద మోకరిల్లే పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయని అలాంటి పార్టీలు మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
అలాంటి పార్టీలను తరిమికొట్టి బుద్ధి చెప్పాలన్నారు. శనివారం కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు.
2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడమే లక్ష్యంగా మోడీ పని చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశాల్లో 5వ స్థానంలో ఉందని.. మరో మూడేళ్లలో దీనిని 3వ స్థానానికి చేర్చేందుకు ప్రధాని అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయిలో భారత్ చేరిందని, 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్ లో అభివృద్ధి జరుగుతోందన్నారు.
75 ఏళ్లుగా నావికా దళం జెండాపై సెయింట్ జార్జ్ లూయిస్ పేరుతో ఉన్న సింబలే కొనసాగిందని.. మోడీ హయాంలో దాని స్థానంలో ఛత్రపతి శివాజీ రాజముద్రను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితిలో 190 దేశాలను ఒప్పించి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించారంటే అది మోడీ గొప్పతనం అని అన్నారు బండి సంజయ్.