– జాతీయ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది..
– నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ లోనే ఉండమన్నారు
– నాకేం కావాలో కేటీఆర్ కు బాగా తెలుసు..!
– పార్టీ మారే విషయంలో ఇంకా ఆలోచిస్తున్నా..
– మార్చిలో కొత్తపార్టీలో వెళ్లడం ఖాయం
– పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా లేక కమల తీర్థం పుచ్చుకుంటారా..అనేదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలన్నీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు పార్టీ మారబోతున్నారనే చర్చ కూడా జోరుగా సాగుతుంది. అయితే ఆయన మాత్రం ఇంకా కాస్త టైమ్ ఉందని.. తొందర పడేదే లేదని.. అంతా ఆచితూచిన తరువాతే పార్టీ మారుతానని క్లారిటీ ఇస్తున్నారు. ఆయనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
పొంగులేటి బీజేపీలో చేరుతున్నారని, అదే విధంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పొంగులేటి మాత్రం ఇపుడున్న పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశారు. ఏ పార్టీ అన్నదాని పై కూడా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. వైసీపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం తనను సంప్రదిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకునేసరికి రెండున్నర సంవత్సరాలు పట్టిందన్నన్నారు. సంక్షోభం లేని సమయంలోనే అంత టైం తీసుకుంటే ఈ పరిస్థితుల్లో అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోవడం కుదరదన్నారు.
జాతీయ పార్టీలు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని ఇంకా తన అభిప్రాయాన్ని మాత్రం ఎవ్వరికీ వెల్లడించలేదని చెప్పారు. పార్టీ కోసం మొదటి నుంచి ఎంతో కష్టపడ్డానని..చివరికి పదవులు కూడా వదులుకున్నానని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా బీఆర్ఎస్ పార్టీలో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదన్నారు. పార్టీ లో ఉండాలని ఎంపీ నామా నాగేశ్వర రావు తనను కోరినట్లు చెప్పారు. పదవుల కోసం,వ్యాపారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల ఆశీస్సులు,దీవెనలతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
తాను ఒక్కడినే ఒంటరిపోరు చేస్తున్నానని,తనపై అనేక మంది దండయాత్ర చేసే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించుకుని అందరినీ సంప్రదిస్తున్నానని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సంప్రదిస్తే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని అందరి నిర్ణయం మేరకు ఆలోచన చేస్తానంటూ చెప్పుకొచ్చారు ఆయన. పార్టీ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎవరూ తనను సంప్రదించలేదని.. ఒకవేళ సంప్రదిస్తే.. అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. తనకేం కావాలో కేటీఆర్ కు తెలుసని పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక భవిష్యత్తు లో అందరి నిర్ణయం మేరకే నిర్ణయం ఉంటుందని.. మార్చిలో పార్టీ మారుతానని ఆయన తేల్చి చెప్పారు.