కిమ్ జోంగ్ ఉన్.. అందరికి ఈ పేరు చాలా బాగా తెలుసు. ఎందుకంటే వింత వింత నిబంధనలు, నియంతృత్వానికి కేరాఫ్ కిమ్. ఇక కిమ్ కు అతని పదేళ్ల కూతురు కూడా తోడైంది. అచ్చం తండ్రిలా ఉన్న ఆమె లైఫ్ స్టైల్ ను చూసి ఉత్తర కొరియా జనం ముక్కున వేలు వేసుకుంటున్నారు.
ఇదేం ఖర్మరా బాబు.. తండ్రి తరువాత వారసురాలిగా ఉన్న కిమ్ జూ ఇప్పుడే ఇలా ఉంటే తరువాత మా భవిష్యత్తు ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఉత్తర కొరియా ప్రజలను వింత చట్టాలతో కాల్చుకొని తింటున్న కిమ్ తన కూతురికి మాత్రం అవన్నీ వర్తించవని చెప్పడంతో జనం ఆగ్రహానికి లోనవుతున్నారు. దేశంలోని ప్రజలకు మాత్రం హెయిర్ స్టైల్ నుంచి మొదలుకొని దుస్తులు ధరించడం వరకు అన్నీ కండిషన్లే.
దీంతో కిమ్ కూతురు లైఫ్ స్టైల్ ను చూసి ఉత్తర కొరియా జనం మండి పడుతున్నారు. కిమ్ కుమార్తె తనకు నచ్చిన ఫ్యాషన్ హెయిర్ స్టైల్ తో ఎంజాయ్ చేస్తుంటుంది. చాలా ఖరీదైన, ఫ్యాన్సీ దుస్తులను ధరిస్తుంది. అంతే కాదు గుర్రపు స్వారీ, స్కీయింగ్, స్విమ్మింగ్ ఇలా తనకు నచ్చినవన్నీనేర్చుకుంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. దీంతో ఆమె జీవన శైలిని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
అయితే మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆమె విలాసవంతమైన జీవనశైలిని చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు ఉత్తర కొరియా వాసులు రేడియో ఫ్రీ ఆసియాలో వెళ్లగక్కారు. అలాగే తమ నియంత కూతురి లైఫ్ స్టైల్ చూసి నోరెళ్లబెడుతున్నారు. దేశంలోని సామాన్యుల జీవితం కష్టాల కడలిలోనే గడిచి పోతుంటే.. కిమ్ మాత్రం పట్టించుకోవడం లేదని దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే.. ఈ మధ్య కాలంలో కిమ్ తో పాటు కలిసి ఆయన కూతురు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది.