ఎన్నో ఏళ్ల నుంచి సచివాలయం దగ్గరున్న పెట్రోల్ బంక్ ఇక కనుమరుగు కానుంది. నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్ కోసం ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ అమ్మకాలు నిలిపివేసి, కూల్చివేత పనులు ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి దాదాపు అందరు వీవీఐపీల వాహనాలు పెట్రోల్,డీజిల్ కోసం ఈ పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరేవి. ఇప్పటికే గవర్నర్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల కార్లకు, ప్రోటోకాల్ వాహనాలకు ఇక్కడే ఇంధనాన్ని నింపేవారు. నగర నడిబొడ్డున ఉండడం,నాణ్యత,ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించే పెట్రోల్ బంక్ గా గుర్తింపు రావడంతో అన్ని ప్రభుత్వ వాహనాలకు ప్రభుత్వం ఇచ్చే టోకెన్ల ద్వారా ఇంధనాన్ని పోసేవారు.
దీంతో పాటు నగర నలుమూలల నుంచి ఈ పెట్రోల్ బంక్ కు పెద్ద ఎత్తున ప్రైవేట్ కార్లు, ద్విచక్ర వాహనదారులు ఇక్కడకు వస్తుండడంతో రోజూ దాదాపు 13 వేల లీటర్ల పెట్రోలు, 7 నుంచి 8 వేల లీటర్ల డీజిల్ ను ఈ బంక్ ద్వారా వాహనాల్లో నింపేవారు. ఇక ప్రతి రోజూ 20 నుంచి 25 లక్షల కలెక్షన్ ఉండే ఈ పెట్రోల్ బంక్ ను ప్రభుత్వం మూసివేయడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బంక్ లో 20 మంది సిబ్బందితో పాటు ఒక అధికారి విధులు నిర్వహించేవారు. ఇక ఈ పెట్రోల్ బంక్ ను మూసివేయడంతో కవాడిగూడ మ్యారియట్ హోటల్ సమీపంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తదాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడి దేవాదాయ శాఖకు చెందిన కొంత స్థలాన్ని ప్రభుత్వం కేటాయించారు. అయితే అక్కడ బంక్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యే సరికి నెల పైనే పడుతుంది.