తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షలు ముగిశాయి. లాంగ్ జంప్, షార్ట్ పుట్ వివాదం, అభ్యర్థుల ఆందోళనల నడుమ ఈవెంట్స్ నిన్న పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అభ్యర్థులకు గత నెల 8న ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2.07 లక్షల మంది అభ్యర్థులు ఈవెంట్స్‌కు హాజరయ్యారు.
మొత్తంగా 1.11 లక్షల మంది తుది పరీక్షలకు అర్హత సాధించినట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. వారిలో 52,786 అభ్యర్థులు ఎస్సై తుది పరీక్షకు అర్హత సాధించినట్టు పేర్కొంది. 90,488 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ తుది పరీక్షకు అర్హత సాధించినట్టు వెల్లడించింది.
ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి 59,325 మంది మొయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయినట్టు చెప్పింది. ఇది ఇలావుంటే మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. అంతకు ముందు సివిల్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
సివిల్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో 31.40శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రవాణా కానిస్టేబుల్ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.