సిద్దిపేట జిల్లాలో రాజకీయం మరోసారి నిప్పురాజేస్తోంది. గురువారం జిల్లాలోని తొగుట మండలం గుడికందుల గ్రామంలో.. పలు అభివృద్ది పనుల శంకుస్థానకు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఉద్రిక్తతల నడుమ గ్రామంలోని మినీ కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే. అయితే.. 24 గంటలు గడవక ముందే.. ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
దీంతో జిల్లాలో ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది. కావాలనే టీఆర్ఎస్ నేతలు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి ఉంటారని బీజేపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టాలని.. శిలాఫలకాన్ని కూల్చిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా.. గురువారం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును ఖండిస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు. ఎమ్మెల్యేగా ఉన్న తాను.. అధికారిక కార్యక్రమాలకు వెళ్తే భద్రత కల్పించరా అని పోలీసులను నిలదీశారు.