వరి ధాన్యం కొనుగోలు వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. రా రైస్ కొంటామని కేంద్రం చెప్తుంటే.. దానిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అయితే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని కేసీఆర్ ప్రకటించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పండే మొత్తం వరి ధాన్యంలో 40 శాతం తెలంగాణలో సాగు అవుతోందని చెప్పారు. అయితే.. దీనిపై నెట్టింట తెగ చర్చ జరగడంతో సామాజిక వేత్త విజయ్ గోపాల్ ఎఫ్‌సీఐ ద్వారా దేశంలో బియ్యం కొనుగోళ్లకు సంబంధించిన డేటాను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
2021-22కి సంబంధించి దేశవ్యాప్తంగా 1279.27 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవ్వగా.. అందులో 502.80 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్టు తెలిపారు. వాటిలో తెలంగాణ నుంచి 108.88 లక్షల టన్నులు ఉత్పత్తి అవ్వగా.. 46 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు ఉంది.
ఈ క్రమంలో 502.80 లక్షల టన్నుల్లో 46 లక్షల టన్నులు 40 శాతం అవుతుందా అంటూ కవితను ప్రశ్నించారు. తప్పుడు లెక్కలు చెప్పారని మండిపడ్డారు. ఇలాంటి లెక్కలతో ప్రజలను మోసం చేయొద్దని హెచ్చరించారు విజయ్ గోపాల్.