రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని ఎవరూ మాట్లాడలేని పరిస్థితి కల్పించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ఇండ్లను నిర్మించి ఐదారేళ్లు పూర్తవుతున్నా అర్హులకు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండలోని అంబేదక్కర్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తైనా ఇవ్వకపోవడంతో దాదాపు 300 కుటుంబాలు మురికి కూపాల్లో ఉన్నాయన్నారు. ఇండ్లు లేనివారిని చూస్తే తనకు బాధ వేసిందని, అందుకే లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించే వరకూ అక్కడే ఉండాలనిపించిందన్నారు.
అయితే ఉదయం లబ్దిదారులతో మాట్లాడుతామని అక్కడే పడుకున్న తనను మావోయిస్టు, బందిపోటులా పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై ఫిర్యాదు చేస్తామన్నారు. ప్లాట్లను ఎమ్మెల్యే డబ్బులకు అమ్ముకున్నారనే ఆరోపణలున్నాయని చెప్పారు. ఇండ్లను లబ్దిదారులకు పంచకుండా కలెక్టర్లను ఎమ్మెల్యేలు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
ఇండ్లను అర్హులకు అందించాల్సిన అధికారం, బాధ్యత జిల్లా కలెక్టర్లకు ఉందన్నారు. లబ్దిదారులను మురికి కూపాల్లో ఉంచడం కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా.. అని ఆకునూరి మురళి ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయాలనే డిమాండ్ తో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని చెప్పారు. అయితే సుబేదారి పోలీసులు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని అరెస్ట్ చేశారు. అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో ఆయన నిద్రపోతుండగా తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఇంటి తలుపులు పగుల కొట్టి మాజీ ఐఏఎస్ ను అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.