డ్రంకన్ డ్రైవ్ ప్రాణాలపైకి తెస్తుందని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మందుబాబులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ..అలానే తాగి వాహనాలు నడుపుతున్నారు. అయినా ఒక సారి సరే.. రెండు సార్లు సరే.. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు.
ఇక పదే పదే తాగేసి తూలుతూ వాహనాల్లో తిరుగుతుంటే పోలీసులు ఊరుకుంటారా.. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కేరళ పోలీసులు షాక్ ఇచ్చారు. మందుబాబులకు వార్నింగ్ ఇచ్చి, ఫైన్ లు వేసి విసిగిపోయిన పోలీసులు వినూత్నంగా పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి శిక్ష విధించారు.
మందు కొట్టి వాహనాలు నడుపుతున్న వారితో.. పాఠశాల విద్యార్థుల తరహాలో ఇంపోజిషన్ రాయించారు. ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కేరళ హైకోర్టు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వింత శిక్ష వేశారు. ‘ఇక పై తాగి డ్రైవింగ్ చేయను’ అని వారితో వెయ్యి సార్లు రాయించారు. మందుబాబులంతా చేసేది లేక పోలీసు స్టేషన్ లో నేల మీద కూర్చొని ఇంపోజిన్ రాశారు. ఇంపోజిషన్ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పొలీసులు వెల్లడించారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి వారి లైసెన్సులు సస్పెండ్ చేయనున్నామని చెబుతున్నారు. మరి ఇప్పుడైనా మందుబాబులకు బుద్ధి వస్తుందో.. లేదో చూడాలి.