ఇండియాలో ఐఫోన్ 12 మోడల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ఇక్కడే ఆ మోడల్ హ్యాండ్‌సెట్లను తయారు చేసేందుకు యాపిల్ సంస్థ ఆలోచిస్తోంది. ప్రస్తుతం చైనాలో చైనాలో ఐఫోన్ 12 మోడల్ హ్యాండ్‌సెట్లు తయారవుతుండగా.. ఆ సంస్థకు ఉన్న మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతం దాకా ఇండియాకు తరలించాలని భావిస్తోంది. తరచూ చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తుతుండటం, ఒకదేశంపై మరొకదేశం ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధిస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో యాపిల్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అమెరికా, చైనాల మధ్య తలెత్తె వివాదాల్లో తమకు ఎలాంటి సమస్య రాకుండా.. ముందు జాగ్రత్తగా యాపిల్ ఐఫోన్ 12 హ్యాండ్‌సెట్ల తయారీలో కొంత భారత్‌కు తరలించాలని కసరత్తు చేస్తున్నట్టుగా అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది.
కాగా ఇప్పటికే యాపిల్ ఇండియాలో ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 11 హ్యాండ్‌సెట్లను తమ భాగస్వాములతో కలసి తయారు చేస్తోంది. ఇప్పుడు ఐఫోన్ 12 హ్యాండ్‌సెట్ల తయారీకి కూడా సిద్ధమవుతుండటంతో.. దేశీయంగా ఈ మోడల్ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. దీంతో యాపిల్‌కు ఇంపోర్ట్ టాక్స్ తగ్గనుండటం ఇక్కడి వినియోగదారులకు కలిసి రానుంది. ప్రస్తుతం ఇండియాలో ఐఫోన్ 12 రిటైల్ ధర రూ.70 వేలకు అటు, ఇటుగా పలుకుతోంది.