ఓ వైపు ప్రైవేట్ విద్యా రంగానికి ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుంటే పరిస్థితులు మాత్రం పూర్తి విరుద్దంగా ఉన్నాయి. గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతుంది. ఇప్పుడు తాజాగా ఓ ఆశ్చర్యకర సంఘటన ఒకటి ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో చోటుచేసుకుంది.
కాకతీయ యూనివర్శిటీ పరిధిలో ప్రస్తుతం డిగ్రీ ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటికి 20 మార్కులుంటాయి. వాస్తవానికి మామూలు పరీక్షలాగానే ఇంటర్నల్ పరీక్షలకు ప్రశ్నాపత్రం ఇవ్వాలి. ఇందుకు భిన్నంగా ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం వాట్సాప్ లోనే ప్రశ్నాపత్రం పంపించారు.
విద్యార్థులు దానిని సెల్ ఫోన్ లో చూస్తూ ఆన్సర్ షీట్లో జవాబులు రాస్తూ కనిపించారు. కొందరు విద్యార్థులు ఇదే అదునుగా భావించి ఇంటర్నెట్ లో సమాధానాలు వెతికి పరీక్ష రాశారు. ఈ విషయమై ప్రిన్సిపల్ జగ్ రాం అంతర్బేదితో మాట్లాడగా.. “వాస్తవానికి పేపర్ ఇవ్వాలి. ప్రింటర్ పాడవ్వడంతో పిల్లలకు వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేశాం. పిల్లలు కాపీ కొట్టకుండా ఆరుబయటే కూర్చో బెట్టి పరీక్ష రాయిచాం.. “ అని సమాధానమిచ్చి జారుకున్నారు.
మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందోనని ప్రభుత్వం ఆలోచించి.. సంబంధించిన సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కనీసం ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు కూడా ఇవ్వలేని దుస్థితి లో తెలంగాణ విద్యావ్యవస్థ ఉందని ఈ వార్త సోషల్ మీడియీలో వైరల్ అవుతుంది.