పోడు భూముల సమస్య.. చాలాకాలంగా ప్రభుత్వానికి గిరిజనులకు మధ్య సాగుతున్న వివాదం. దీనిని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఊసే గుర్తు లేనట్లు పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెంలో ఏకంగా 12మంది మహిళలను గత నెలలో జైలుకు పంపిన ఫారెస్ట్ అధికారులు నిన్న మరోసారి కోయపోషగూడెంపై విరుచుకుపడ్డారు.
కోయపోషగూడెంలో గిరిజనుల పోడు భూముల దగ్గరకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అధికారులు ఆ స్థలాల్లో వేసుకున్న గుడిసెలను తొలగించారు. గిరిజనులు అధికారులను వేడుకున్నా కనికరించలేదు. అంతేకాకుండా గుడిసెలను బలవంతంగా తొలగించారు. అయితే.. తమ భూములను వదులుకునే విషయంలో ఆదివాసీలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. జోరు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా తమ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారు.
పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండటంతో గిరిజనులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తరచూ అటవీ అధికారులతో వివాదాలు నెలకొంటుండంతో పోడు రైతులు పోరుబాట పడుతున్నారు.
కోయపోషగూడెంలో తొలగించిన గిరిజనుల గుడిసెలను తిరిగి నిర్మించుకున్నారు బాధిత గిరిజనులు. వర్షం పడుతున్నాలెక్కచేయకుండా పోడు పోరును కొనసాగిస్తున్నారు. అంతేకాదు అదే చోట మళ్లీ గుడిసెలను వేసుకున్నారు. ఈ మట్టిని నమ్ముకుని బతుకుతున్న తాము వేరే ఎక్కడికో ఎలా వెళ్లగలమని ఆవేదన వ్యక్తం చేశారు.