తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే ప్రధాని మోదీకి సరెండర్ అయ్యారా? ప‌్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టే ఢిల్లీ వెళ్లొచ్చాక యూటర్న్ తీసుకున్నారా? అంటే అవుననే అంటోంది టీఆర్ఎస్ యాంటీ బ్యాచ్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరంగల్ రూరల్ జిల్లా ఎమ్మెల్యేలు భారీ నిరసనకు పిలుపునిచ్చి.. తీరా సమయానికి దాన్ని విత్ డ్రా చేసుకోవడమే ఇందుకు సాక్ష్యం అని వారు చెబుతున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేకులు చెప్తున్నారనే కాదు.. ఈ హఠాత్ పరిణామం టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
గోదావరి జలాల సాధన, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వరంగల్ రూరల్ జిల్లాలో టీఆర్ఎస్ నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. కార్యక్రమాన్ని సకెస్స్ చేయడం కోసమని జిల్లాకు చెందిన పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేష్, గండ్ర వెంకటరమణారెడ్డి చాలా చాలా శ్రమించారు. మీడియా సమావేశాలతో హడావుడి చేయడంతో పాటు భారీ ఎత్తున ప్రచారమూ నిర్వహించారు. అంతా చేసి చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్టు ఎమ్మెల్యేలు ప్రకటించారు. అది కూడా వాట్సాప్‌లో మీడియాకు, పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చారు.
వరంగల్ రూరల్ జిల్లా ఎమ్మెల్యేలు ఇలా సడెన్‌గా కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడానికి కారణం.. టీఆర్ఎస్ అధిష్టానం వారించడమేనని తెలుస్తోంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు సీఎం కేసీఆర్ మద్దతుగా మాట్లాడిన తర్వాత కూడా కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని ఆయా ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కార్యక్రమం రద్దు చేసుకోవడానికి గల కారణాలను ఆయా ఎమ్మెల్యేలు సరిగా చెప్పడం లేదు. దీంతో బీజేపీ భయపడే కేసీఆర్ వెనక్కి తగ్గుతున్నారన్న అభిప్రాయాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.