ఎమ్మార్వో ఆఫీసులపై ఏసీబీ-అసలు కారణం ఇదేనా..? - Tolivelugu

ఎమ్మార్వో ఆఫీసులపై ఏసీబీ-అసలు కారణం ఇదేనా..?

ఓవైపు అమరావతి రాజధాని పరిధిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు, ప్రత్యారోపణలతో భూముల అంశం వేడుక్కుతోన్న తరుణంలో… రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఆఫీసులపై ఏసీబీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా ఎమ్మార్వో ఆఫీసులే టార్గెట్‌గా ఏసీబీ మూకుమ్మడి సోదాలు నిర్వహిస్తోంది.

మాములుగా అయితే ఏసీబీ సోదాలు ఇంత పెద్ద ఎత్తున జరగవు. జరిగినా అవినీతి వ్యవహరంలో ఒకటి రెండు చోట్లకే పరిమితం అవుతాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా… యావత్ ఏపీ వ్యాప్తంగా దాడులు జరుగుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏసీబీ మూకుమ్మడి దాడులతో రాజకీయ ప్రముఖుల భూముల కథను జగన్‌కు అందబోతుందన్న ప్రచారం సాగుతోంది.

ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్న ప్రముఖుల పేరుతో పాటు వారి వారి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భూముల చిట్టా ఏసీబీ సేకరిస్తోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ దాడుల తర్వాత టీడీపీలో చురుకుగా ఉన్న నేతలపై ప్రభుత్వ శాఖల వేధింపులు పెరగబోతున్నాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ దాడుల్లో నేతల చిట్టా దొరుకుతుంది. ఆ నివేదికల ఆధారంగా ప్రతిపక్ష పార్టీ నేతలు నోరు తెరవకుండా బెదిరింపులకు దిగుతారని స్పష్టం చేస్తున్నారు.

అయితే… ఏసీబీ సహా ప్రభుత్వ వర్గాలు మాత్రం గత రెండు సంవత్సరాలుగా మండల రెవెన్యూ కార్యాలయాల్లో వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్నందునే ఏసీబీ రంగంలోకి దిగిందని స్పష్టం చేస్తున్నాయి.

Share on facebook
Share on twitter
Share on whatsapp