అనుకున్నదే అయింది. ఔనన్నా కాదన్నా… తామనుకున్నది జగన్ సాధించారు. ఇందుకు బిజెపి ఆడిన తొండాట మరింత హెల్ప్ చేసింది. ప్రత్యేక హోదా విషయంలో మొండి చేయి చూపించిన బిజెపి… మూడు రాజధానుల విషయంలో తొండి చేయి చూపించిందనే చెప్పాలి. సీఆర్డీయే రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదించేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమిస్తున్నట్లు ఆదేశాలిచ్చిన 24 గంటలలోపు.. ఏదో డీల్ కుదిరినట్లుగా.. గవర్నర్ ఈ బిల్లులను ఆమోదించారనే కామెంట్లు వస్తున్నాయి. ఇక ఎవరు కారణం అనుకున్నా.. ఏం జరిగిందనుకున్నా.. అమరావతి అయితే ఇక కేవలం అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే పరిమితం కానున్నది. విశాఖపట్నం ఏపీ అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా నిలబడనున్నది. కర్నూలు కూడా న్యాయరాజధానిగా అయిపోతుంది. గతంలో హైకోర్టు తరలింపు కష్టమేమో అనుకున్నారు.. కాని బిజెపి వైసీపీ ద్వయం చూపించిన కోఆర్డినేషన్ చూస్తుంటే.. అది కూడా సాధ్యమే అనిపిస్తోంది.
రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చినప్పుడే అసలైన క్లారిటీ వచ్చేసింది. అంతే కాదు.. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం రాజధానిపై మాట్లాడినప్పుడు ఎక్కడా మూడు రాజధానులకు వ్యతిరేకమని కాని.. అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నామని గాని అనకుండా.. కేవలం రైతులకు అన్యాయం జరగకూడదని చెప్పారు. జనసేన ప్రెస్ స్టేట్ మెంట్ లో సైతం అది జాగ్రత్తగా రాశారు. అప్పుడు కూడా అనుమానాలు వచ్చాయి. ఇప్పుడా అనుమానాలు నిజమయ్యాయి.
బిజెపిపై అనుమానాలు ఇప్పుడే కాదు… గతంలో అమరావతి తరలింపును అడ్డుకుంటామని.. లాంగ్ మార్చ్ చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్.. సడెన్ గా ఢిల్లీ వెళ్లి బిజెపితో ఫ్రెండిషిప్ అంటూ ప్రకటించిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. అప్పటి నుంచి అమరావతికి పవన్ కల్యాణ్ వెళ్లింది లేదు.
ఇక ఏపీ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అయితే తీవ్రమైన ప్రకటనలు చేశారు.. కాని ఆయనపై విజయసాయిరెడ్డి పదే పదే స్టాంపులు వేసి వేసి.. ఆయనను మార్చేవరకు నిద్రపోలేదు. చివరకు వారు కోరుకున్నట్లే కన్నాను తొలగించి.. వైసీపీ ఫ్రెండ్ సోము వీర్రాజును నియమించారు. అప్పుడు సైతం.. బిజెపి వైఖరిపై అనుమానాలు వచ్చాయి. ప్రత్యేక హోదాపై తమ వైఖరికి ఏనాడు బిజెపి పశ్చాత్తాపపడలేదు. పైగా టీడీపీ అధికారం కోల్పోయిందని ఆనందపడ్డారే తప్ప.. తమకు రావాల్సిన కనీస ఓట్లు కూడా రాలేదనే విషయాన్ని పట్టించుకోనట్లే నటించారు. ఇక ఇప్పుడు రాజధాని విషయంలోనూ.. ఒకవైపు వ్యతిరేకిస్తున్నామంటూనే.. వైసీపీతో చెమ్మచెక్కలాడారని అర్ధమైపోతుంది. మరోసారి ప్రజాగ్రహానికి గురికాక తప్పదనే విమర్శలు వస్తున్నాయి.