ముప్పై జుట్లు కలిసి ఉంటాయి గానీ.. మూడు సిగలు కలిసి ఉండవనేది సామెత. వైఎస్సార్ తెలంగాణ పార్టీని చూస్తే ఇప్పుడదే గుర్తుకొస్తోంది. ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న షర్మిల, ఇందిరా శోభన్ కలిసి పనిచేయడం కూడా అసాధ్యమని త్వరగానే తేలిపోయింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఇందిరా శోభన్ తాజాగా రాజీనామా చేశారు. ఏదో ఒక రోజు ఇదే జరుగుతుందని మొదటి నుంచే విశ్లేషకులు అంచనా వేస్తున్నా… ఊహించినదానికంటే ముందే ఆరోజు వచ్చేసింది. ఇంతకి ఇందిరా శోభన్ వైఎస్సార్‌టీపీని ఎందుకు వదిలేసినట్టు? అసలేం జరిగి ఉంటుంది?
తెలంగాణలోని మహిళా రాజకీయ నాయకుల్లోని మంచి వక్తల్లో ఇందిరాశోభన్ ఒకరు . కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మంచి మైలేజ్ సంపాదించుకున్నారు. కానీ షర్మిల తెలంగాణలో పార్టీ పెడతున్నట్టు ప్రకటించగానే ఊహించని విధంగా అందులో చేరారు. ఆమెకు ప్రధాన అనుచరురాలిగా వ్యవహరించారు. షర్మిల చేపట్టే కార్యక్రమాలు, జిల్లాల పర్యటనల్లో కీలకంగా ఉంటున్నారు . అడ్ హాక్ కమిటీ ఏర్పాటు, పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే పార్టీలో పెద్ద నేతలెవరూ పెద్దగా లేకపోయినా.. కనీసం కాంగ్రెస్‌లో దక్కిన గౌరవం కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీలో దక్కడం లేదన్న అసంతృప్తి ఇందిరా శోభన్ లో ఉందని తెలుస్తోంది. షర్మిల ఒంటెత్తు పోకడ కారణంగా ఇద్దరి మధ్య పొసగడం లేదన్న మాటలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
మరోవైపు గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఇందిరా శోభన్.. తన సామాజికవర్గం వారితోనే పార్టీని నింపేస్తున్నారని, వైఎస్ అభిమానులను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు షర్మిల దృష్టికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అలాగే మహిళా కార్యకర్తలనూ ఇందిరా శోభన్ విస్మరిస్తున్నారని పలువురు షర్మిల దగ్గర వాపోయినట్టుగా ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలో ఇందిరాశోభన్‌కు ఇచ్చిన అధికారాల్లో షర్మిల కోత పెట్టారని .. దీంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. పైగా షర్మిలకు ప్రధాన సలహాదారుగా ఉంటానని తాను భావిస్తే.. ఉన్నట్టుండి పీకే శిష్యురాలు ప్రియని షర్మిల స్ట్రాటజిస్ట్ గా తీసుకురావడంతో తన ప్రాభవానికి చెక్ పడి, తన మాట చెల్లే అవకాశం లేదని ఆమె భావిస్తున్నారని సమాచారం.
ఇక కాంగ్రెస్ తెలంగాణలో కోలుకునే అవకాశం లేదని అనిపించడంతో అప్పట్లో ఆమె పార్టీ వీడారు. కానీ రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడంతో సీన్ మారిపోయింది. ఒకరకగా తనది రాంగ్ స్టెప్ అని ఆమె భావించారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు కూడా బలమైన మహిళా గొంతు అవసరం ఉందని.. తిరిగి పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి కోరడంతో సొంత గూటికి వెళ్లాలని అనుకుంటున్నారని సమాచారం. త్వరలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.