నిర్మల్ జిల్లాలో ఐదుగురు దళితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. నర్సాపూర్ జీలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అలేఖ్య అనే టీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు మేరకు ఐదుగురు దళితులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక విషయంలో నర్సాపూర్ జీ గ్రామస్తులపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
దళితబంధు అడిగినందుకు తమపై కేసులు నమోదు చేశారంటూ బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై జిల్లాలో తీవ్రంగా చర్చనడుస్తోంది. ఈ ఘటనపై దళిత సంఘాలు చాలా తీవ్రంగా మండిపడుతున్నాయి.
అక్టోబర్ 26న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కోసం మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా నర్సాపూర్ -జి గ్రామానికి వెళ్లారు. ఆ కార్యక్రమంలో తనకు దళిత బంధు రావడం లేదంటూ మంత్రికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనకు దళితబంధు రావడం లేదని, ఎంపిక విషయంలోనూ పారదర్శకత లేదని ఆమె పేర్కొంది.
దీంతో ఆ మహిళపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమకు ఇష్టం వచ్చిన వాళ్లకు దళిత బంధు ఇస్తామని మండిపడ్డారు. వచ్చే వరకు ఓపిక లేకుంటే ఏం చేయలేమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చింది ఎక్కువైతే ఇలాగే ఉంటదని, ఒక్కసారిగా 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చూపెట్టంటు ఆమెపై మండిపడ్డారు.
దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటున్నారని అవి అన్నం పెడుతాయా..? అని ఆయన ప్రశ్నించారు. రూ.10 లక్షలతో ఏం చేసి బతుకుతారు..? మీకు ఏం అనుభవం ఉంది అని ప్రశ్నించారు. దానికి సమాధానం చెబితేనే దళిత బంధు ఇస్తామన్నారు. మీకు దళిత బంధు తామియ్యబోమన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ల నుంచే అడిగి తీసుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.