వేసవి కాలం ముంగిట్లోకి వస్తుండగా కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో పొలాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గంటకోసారి కోత పెట్టకుండా తమ పంటలు కాపాడాలంటూ రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంటోంది.
ఏకధాటిగా విద్యుత్ ఇవ్వకపోవడంతో వచ్చే కరెంటుతో తడిసిన పొలాలే మళ్లీ తడుస్తున్నాయి తప్ప.. పంటలకు నీళ్లు అందడం లేదు. యాసంగి సీజన్ లో పొలాలు ఎండిపోతున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు కరెంటు ఇవ్వడంతో పొలాల దగ్గరే రైతులు 24 గంటలూ పడిగాపులు కాస్తున్నారు.
ఉమ్మడి కరీరంనగర్ జిల్లాలో అధికారులు ఒక్కో ఊర్లో ఒక్కో సమయంలో కరెంటు ఇస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 99 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. పెద్దపల్లి జిల్లాలో ఒక లక్ష 33 వేలకు పైగా,జగిత్యాలలో 72 వేలు,రాజన్న సిరిసిల్ల జిల్లాలో 73 వేలకు పైగా, ఉమ్మడి జిల్లాలో మొత్తం 3 లక్షల 79 వేల వ్యవసాయం కనెక్షన్లు ఉన్నాయి.
అయితే కొన్ని చోట్ల పగటి పూట ఇవ్వడం, కొన్ని చోట్ల రాత్రి పూట ఇవ్వడంతో పొలాలకు సరిగా నీరు అందడం లేదు. పొలాల దగ్గర ఉన్న కరెంట్ మీటర్ల దగ్గరే రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు అధికారులు. అయితే ఇప్పటికే చీడపీడల కారణంగా నష్టపోతున్నామని.. తాజాగా కరెంటు కోతలతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.