శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అష్టాక్షరీమంత్ర జపంతో సహస్రాబ్ది మహోత్సవం ప్రారంభమయ్యింది. సమతామూర్తి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా 12 రోజుల పాటు జరిగే వేడుకల కోసం ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ముస్తాబయ్యింది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రారంభోత్సవానికి అంకురార్పణ జరగనుంది. వెయ్యి 35 కుండలతో కూడిన లక్ష్మీనారాయణ మహా యాగంతో వేడుకలను ప్రారంభిస్తున్నారు. తొలుత ఆ ప్రాంత భూమి పూజ, వాస్తు పూజ చేస్తారు. వివిధ సంప్రదాయాలను అనుసరించే 5 వేల మంది రుత్వికులు దీక్షధారణ చేసి పూజల్లో పాల్గొంటారు.
ఈ వేడుకలను వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అక్కడికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండేలా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. ప్రజల సౌకర్యార్ధం ద్వారా భక్తులకు రవాణ సదుపాయం కల్పించనున్నట్లు ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. భక్తులు, ఆసక్తిగల ప్రజలు, ముచ్చింతల్ ను సందర్శించాలనుకునేవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అక్కడికి వెళ్లాల్సిన రూట్లను సైతం ప్రయాణికులకు తెలిపారు సజ్జనార్.
455 నెంబర్ ఎక్కి శంషాబాద్ చేరుకోవచ్చు. లేదంటే ఉప్పల్ చేరుకుని.. అక్కడ 300 నెంబర్ బస్సు ఎక్కి ఆరాంఘర్ కు చేరుకొనే అవకాశం ఉందన్నారు. అక్కడి నుంచి శంషాబాద్ మీదుగా తొండుపల్లి, ఘాన్సిమాయా గూడ, పెద్దషాపూర్, మదనపల్లి, బస్టాపు మీదుగా.. శ్రీరామనగరం చేరుకోవచ్చు. అందుకు ఎంజీబీఎస్ నుంచి షాద్ నగర్ వైపు వెళ్లే బస్సు ఎక్కి మదనపల్లి దగ్గర దిగాల్సి ఉంటుంది. అక్కడ ఆటో ఎక్కి శ్రీరామనగరానికి చేరుకోవచ్చని ఆయన వెల్లడించారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారు రైళ్లలో ప్రయాణిస్తే.. కాచిగూడలో దిగిన తర్వాత 2 లేదా 3 నెంబర్ ఆర్టీసీ బస్సు ఎక్కి.. అప్జల్ గంజ్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి శంషాబాద్, షాద్ నగర్ వైపు వెళ్లే బస్సులు ఎక్కితే మదనపల్లికి చేరుకుంటారని అన్నారు. సికింద్రాబాద్ లో దిగితే.. 251 నెంబర్ బస్సు ఎక్కితే శంషాబాద్ చేరుకుంటారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో దిగితే.. 7, 8, 9 నెంబర్ గల బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అవి ఎక్కితే అప్జల్ గంజ్ చేరుకోవచ్చన్నారు. శ్రీరామానుజచార్య సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలు నేటి నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలు ముగిసే వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల నడుపనున్నట్టు సజ్జనార్ తెలిపారు.