ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మూడో వారానికి చేరుకుంది. ఇప్పటివరకు కీలకమైన కీవ్, ఖార్కివ్, మరియుపోల్ తదితర సిటీలపైనే మిసైళ్ల వర్షం కురిపించిన రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్ నలువైపులా సమాంతరంగా దాడులు చేస్తోంది. రాజధాని సరిహద్దుల నుంచి మెల్లమెల్లగా సిటీలోకి చొచ్చుకొస్తోంది. రోజురోజుకు బలగాల సంఖ్యను పెంచుతూ.. మిలటరీ బేస్ లు, ఎయిర్ పోర్టులు, ఇండ్లు, గోదాములు, ఆస్పత్రులు, స్కూళ్లు, మసీదులు.. ఇలా దేన్నీ వదలకుండా ధ్వంసం చేస్తోంది.
అందులో భాగంగానే ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతం నుంచి తరలించేందుకు ఏర్పాటు చేసిన మానవతా కాన్వాయ్ పై రష్యా దాడి చేసింది. వారిని బలవంతంగా వెనక్కి వెళ్లేలా చేసింది. రష్యా బలగాల దాడిలో ఓ చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కీవ్ కు ఈశాన్యంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెరెమోహా గ్రామం నుంచి వందల మంది స్థానికులు వలస వెళ్లేందుకు ప్రయత్నించగా ఈ దాడికి పాల్పడ్డాయి రష్యన్ బలగాలు. ఇందులో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
మరోవైపు ఖెర్సాన్ ఓబ్లాస్ట్ నగరంలోకి ప్రవేశించిన రెండు రష్యా హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అందులో ఓ పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడని.. స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు కీవ్ ఇండిపెండెంట్ మీడియా వెల్లడించింది. అయితే.. రష్యా సైనిక చర్య చేపట్టినప్పటి నుంచి మొత్తం 1300 మంది ఉక్రెయిన్ సైనికులు వీరమరణం పొందారని వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు.
మెలిటొపోల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా సైన్యం.. ఆ నగర మేయర్ ను కిడ్నాప్ చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అయతే.. మేయర్ విడుదలకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ ను కోరారు జెలెన్స్కీ. మరోవైపు.. మెలిటోపోల్ నగరానికి కొత్త మేయర్ ను నియమించినట్లు జపోరిజ్జియా స్థానిక పరిపాలన విభాగం తెలిపింది. రష్యా అపహరించిన ఇవాన్ ఫెడొరోవ్ స్థానంలో గలినా డనిల్చేంకో ను కూర్చోబెట్టినట్లు స్థానిక మీడియా సంస్థ ప్రకటించింది.