చైనాలో కుప్పకూలిన విమాన ఘటనకు కారణాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కాగా.. ఈ ప్రమాదం జరిగిన గ్వాంగ్జీ పర్వత ప్రాంతాల్లో నాలుగు రోజులుగా రెస్క్యూ సిబ్బంది జల్లడపడుతున్నారు. తాజాగా.. రెండో బ్లాక్ బాక్స్ లభించింది. దీనిద్వారా అసలు ప్రమాదం ఎలా జరిగింది.. దానికి గల కారణాలు ఏంటనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
ఇప్పటికే మొదటి బ్లాక్ బాక్స్ లభించింది. ప్రస్తుతం నిపుణులు దానిని డీకోడ్ చేసి విశ్లేషిస్తున్నట్టు వెల్లడించారు. అయితే.. ఈనెల 21న 132 మందితో వెళ్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం గ్వాంగ్జీలోని ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది.
ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపిన నివేదికలో పేర్కొన్నారు. విమానం కూలిపోవడంతో అడవికి పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి.
భూమికి 26 వేల అడుగుల ఎత్తు నుంచి సరాసరిగా విమానం నేలపై కూలిపోయినట్టు ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకర్ ‘ఫ్లైట్‌రాడార్24’ వెల్లడించింది. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఇది జరిగినట్టు వివరించింది.