ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. మార్చి 18 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి 15 నుండి 17 మధ్య జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపాయి.
కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ప్రస్తుత ఉమ్మడి జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వహించనున్నట్టు తెలిపాయి. కొత్త జిల్లాలకు ఉద్యోగులు, అధికారులను కేటాయించడం, మౌలిక వసతుల కల్పన, ఇతర చర్యలు పూర్తయ్యేంత వరకు కలెక్టర్లు, ఎస్పీలే పాత జిల్లాల బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ పాత జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చినా విభజన, మౌలిక వసతుల కల్పన వ్యవహారాలను మాత్రం వీరే పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్లు, సవరణ ఉత్తర్వులపై జిల్లాల కలెక్టర్లు ప్రజల నుంచి సలహాలు, సూచనలను మార్చి 3 వరకు స్వీకరిస్తారు.
వీటిని మార్చి 10 వరకు పరిశీలించి తర్వాతి రోజు నివేదిక రూపంలో వివరాలను సచివాలయంలోని బిజినెస్ నిబంధనలు రూపొందించే వారి పరిశీలనకు పంపించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు.