తాలిబన్లు అఫ్ఘానిస్థాన్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. రోజు రోజుకు తమదైన శైలిలో ఆంక్షలు చట్రాన్ని బిగిస్తూనే ఉన్నారు. ఇటీవల ఉద్యోగులు ఆఫీసులకు గడ్డంతోనే రావాలని, వదులుగా ఉండే దేశీయ దుస్తులనే వేసుకోవాలని, మహిళలు మగ తోడు లేకుండా విమానాల్లో ప్రయాణించకూడదు వంటి నిబంధనలు విధించారు. తాజాగా మరో కొత్త రూల్‌ను తీసుకోచ్చారు. అయితే, ఇప్పటి వరకు ప్రజలపై మతపరమైన ఆంక్షలు విధించిన తాలిబన్లు.. ప్రజాకర్షక పాలన అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాదు, ప్రపంచ దేశాల మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారు.
అప్ఘానిస్థాన్‌లో ఒపియం సాగుపై నిషేధం విధించింది తాలిబన్ ప్రభుత్వం. సాధారణంగా ఒపియంను హెరాయిన్ వంటి నిషేధిత మాదకద్రవ్యాల తయారీకి ముడిసరుకుగా ఉపయోగిస్తుంటారు. దేశంలో ఇక నుంచి ఒపియం సాగు చేసే రైతులకు జైలుకు వెళ్లడమే కాకుండా, వారి సాగుకు తగలబెడతామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు హెరాయిన్, హషిష్, మద్యం వ్యాపారాలపై కూడా బ్యాన్ విధించారు. ఈ మేరకు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా ఉత్తర్వులు జారీ చేశారు.
అప్ఘాన్ ప్రజలకు ఒపియం సాగు ముఖ్యమైన ఉపాధి, ఆదాయ వనరుగా ఉంది. లక్షలాది మంది రైతులు ఒపియం సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం కంటే ఒపియం ఉత్పత్తులను ఆప్ఘనిస్థానే సరఫరా చేస్తుంది. ఒపియం ఉత్పత్తుల ద్వారా దేశం 1.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ఈ క్రమంలో ఒపియం సాగుపై నిషేధం విధించడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో హెరాయిన్, హషిష్, మద్యం వ్యాపారంపై బ్యాన్‌ను విధించింది. అలాగే, ఒపియం సాగుపై నిషేధం విధించిన క్రమంలో ఉప ప్రధానమంత్రి అబ్దుల్ సలామ్ హనాపీ రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపేందుకు అంతర్జాతీయ దాతల నుంచి సహకారం కోరినట్లు అఫ్ఘాన్ మీడియా టోలో న్యూస్ పేర్కొంది.
గతేడాది ఆగస్టు నుంచి అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన మొదలైంది. వారి రాకతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అంతర్జాతీయ దాతలు నిధులను ఉపసంహరించుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అంతర్జాతీయ మద్దతు లేకపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో ఒపియం సాగుపై బ్యాన్ విధించడం ఆందోళనలు కలిగిస్తుంది.
ఇక ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు ప్రయత్నాలు చేస్తుంది. తమపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతుంది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం తాలిబన్ సర్కారు ముందుంచిన ప్రధాన డిమాండ్లలో ఒపియం సాగుపై నిషేధం ఒకటి. తాలిబాన్ ప్రభుత్వంపై విధించిన ఆంక్షలు ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాంకింగ్ వ్యవస్థ, వ్యాపార అభివృద్ధికి ఆటంకంగా మారాయి. కాగా 1994, 1995 సంవత్సరాల్లో కూడా తాలిబన్ ప్రభుత్వం నల్లమందు వ్యాపారంపై ఇదే విధమైన నిషేధాన్ని విధించింది. అయితే 2001లో తాలిబన్లు అధికారం నుంచి దిగిపోవడంతో నిషేధం రద్దు అయింది.