తెలంగాణలో శివాలయాలకు డబ్బులు కేటాయించడంలో, సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబాటుతనం ప్రదర్శిస్తుందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వివక్ష లేకుండా శివాలయాలకు నిధులు అందిస్తామని రాజేందర్ తెలిపారు.
వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పేద ప్రజల దేవుడు బోలా శంకరుడి దేవాలయాలు నిర్లక్ష్యానికి గురిఅవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శైవాలయాల్లో జరగాల్సినంత అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం బ్రతకాలని.. హుజురాబాద్ లో ధర్మం గెలవాలని.. ఈటల రాజేందర్ గెలవాలని అనేక మంది, అనేక మొక్కులు మొక్కుకున్నారని గుర్తు చేసుకున్నారు. వాటిలో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నామని వివరించారు.
అందులో భాగంగానే శ్రీ రామలింగేశ్వర స్వామి మొక్కు తీర్చుకున్నామని తెలిపారు. ఈ దుర్మార్గపు పాలన పోయి సుపరిపాలన రావాలని కోరుకున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల పాపం కేసీఆర్ కు తప్పక తగులుతోందని అన్నారు ఈటల.