నారా లోకేష్ యువగళం పాదయాత్ర 21వ రోజు గురువారం కొనసాగుతోంది. తిరుపతి, సత్యవేడు నియోజక వర్గాల్లో పాదయాత్ర ప్రారంభమైంది. కేవీబీపురం మండలం, రాజులకండ్రిగలో రైతులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్.
అనంతరం లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం.. అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని రైతు లేని రాజ్యంగా తయారు చేశారని మండిపడ్డారు.
రుణ మాఫీ, సబ్సిడీ రుణాలు, గిట్టుబాటు ధర, భూసార పరీక్షలు లేకుండా జగన్ ప్రభుత్వం రైతులను దగా చేసిందని లోకేష్ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. రాయలసీమలో వ్యవసాయ రంగాన్ని నీరుగార్చారని, సీమపై ప్రేమ లేని జగన్ రెడ్డి రాయలసీమలో ఎలా పుట్టారని అన్నారు.
రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వందేనని లోకేష్ వ్యాఖ్యానించారు. కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారని, ఎవరైనా దొంగతనం చేసి కోర్టకు వెళ్తారు.. కానీ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారని నారాలోకేష్ అన్నారు. దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయితే రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.