కన్న పిల్లలే ప్రపంచంగా జీవిస్తుంది తల్లి. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అలాంటి తల్లిని కన్నుమిన్ను ఎరుగక కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో పాపమ్మ అనే మహిళ తన కొడుకు, కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. పాపమ్మ కొడుకు సుధీర్ మతి స్థిమితం కోల్పోయి.. సైకో లాగా ప్రవర్తిస్తుంటాడు. అయినా.. తన కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది ఆ తల్లి. ఈ తరుణంలో ఆదివారం అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో మతిస్థిమితం కోల్పోయిన సుధీర్.. ఎక్ససైజ్ చేస్తున్నాడు. గమనించిన తల్లి పాపమ్మ మందలించింది.
కోపోద్రిక్తుడైన సుధీర్.. తల్లిపై విరుచుకుపడ్డాడు. అక్కడే ఉన్న రాడ్ తో తల్లి పాపమ్మ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. నేలపై కుప్పకూలింది. గమనించిన పాపమ్మ కూతురు అడ్డం వచ్చింది. మతిస్థిమితం కోల్పోయిన సుధీర్.. తన చెల్లెలుపై కూడా రాడ్ తో దాడి చేశాడు. ఆమె కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పాపమ్మ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన పాపమ్మ కూతురును చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పాపమ్మ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను గతకొన్ని రోజులుగా సైకోగా ప్రవర్తిస్తున్నట్టు గుర్తించారు.