సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ లో అగ్ని ప్రమాదం జరిగి రెండు రోజులైనా వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. బిల్డింగ్ నుంచి అక్కడక్కడా పొగలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది వేడిని తగ్గించేందుకు ఫోమ్ కొడుతున్నారు.
మరోవైపు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో పడింది. దాదాపు 10 గంటల పాటు మంటలు కొనసాగడంతో బిల్డింగ్ చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. బిల్డింగ్ పటిష్టత పై జీహెచ్ఎంసీ అధికారులకు ఇవాళ పూర్తిస్థాయి నివేదిక అందనుంది. శుక్రవారం బిల్డింగ్ స్ట్రక్చర్ స్టెబిలిటీని వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ రమణారావు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రదీప్ పరిశీలించారు. గంటల తరబడి భవనం మంటల్లో చిక్కుకుపోవడంతో స్లాబులు పూర్తిగా దెబ్బ తిన్నట్లు అధికారులు గుర్తించారు.
కొన్ని ఫ్లోర్లలో స్లాబులు క్రాస్ అయినట్లు చెప్పారు . క్రింది అంతస్తులు బాగా డ్యామేజ్ కావడం తో వాటిని రిపేర్ చేయడం కూడా కష్టమేనని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇలా ఉంటే ఈ ప్రమాదం పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ దుర్ఘటనలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదు. భవనంలోకి అడుగుపెట్టడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో విక్టిమ్ లోకేషన్ కెమెరాతో కూడిన డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.
గల్లంతైన డెక్కన్ కార్పొరేటర్ ఉద్యోగులు జునైద్,వసీం, జహీర్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాలని పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నించగా వీరి సెల్ ఫోన్ల లాస్ట్ లొకేషన్స్ భవనం వద్దే ఉండగా.. ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇక ఈ భవనాన్ని ఆనుకొని ఉన్న సుమారు 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భవనం వెనుక ఉన్న ఉత్తమ్ టవర్స్ లో కిమ్స్ ఆసుపత్రి నర్సింగ్ హాస్టల్ ఉంది. ఇక్కడ నుంచి నర్సులను ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని కూల్చిన తర్వాతే చుట్టుపక్కల వారికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.