ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉండాల్సిన విశ్రాంతి భవనానికి సిబ్బంది తాళాలు వేసి జల్సా చేసుకుంటున్న సంఘటన మక్తల్ లో ఆదివారం చోటు చేసుకుంది. స్వాతంత్రానికి పూర్వం నిజాం కాలంలో హైదరాబాద్ – రాయిచూరు వెళ్లే మార్గంలో తనకు వీలుగా 1857 సంవత్సరంలో నిజాం ప్రభు జాతీయ రహదారిపై మక్తల్ పట్టణంలో విశ్రాంతి భవనాన్ని నిర్మించాడు.
ఇప్పటికీ ఆ విశ్రాంతి భవనం చెక్కు చెదరకుండా పటిష్టంగా సౌకర్యవంతంగా ఉంది. కానీ ఇక్కడ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా విధులకు గైర్హాజరు అవుతున్నారు.
దీంతో ప్రభుత్వ అధికారులకు, అతిథులకు ఈ భవనం అందుబాటులో లేకుండా పోయింది. మక్తల్ కేంద్రంగా ప్రముఖ దేవాలయానికి ఓ రాష్ట్ర అధికారి వెళ్తూ విశ్రాంతి భవనం గేట్లకు తాళం వేసి ఉండటాన్ని గమనించారు.
అక్కడ విధుల్లో ఎవరూ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విశ్రాంతి భవనం దగ్గర 24 గంటలూ అందుబాటులో ఉండాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ప్రధాన గేటుకు తాళం వేశారు.