కాశ్మీర్ లో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ హత్యలను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూనే.. ఈ నెల 30 నుండి ప్రారంభం కానున్న అమరనాథ్ యాత్రకు భద్రతను పటిష్ట పరుస్తోంది. స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గత పక్షం రోజులలో రెండు సార్లు ఈ విషయమై అత్యున్నతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్ష జరిపారు.
ఈ మేరకు శుక్రవారం సమావేశం నిర్వహించారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు, పౌరుల భద్రత, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు అమలు చేసే వ్యూహాలపై సమీక్షించారు. జూన్ 30 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే అమర్‌నాథ్ యాత్రను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదిలా ఉంటే.. లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ.. జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు. లోయలో కొందరు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రజలెవరూ భయాందోన చెందాల్సిన అవసరం లేదని.. అమర్‌నాథ్ యాత్ర నిర్వహించడంలో వెనక్కి తగ్గేదిలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ యాత్రను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటికే 2.5 లక్షల మంది యాత్రికులు ఆ యాత్రకు నమోదు చేసుకున్నారు.