రాష్ట్ర పజలకు ఉపయోగపడే నిత్యావసర సరుకుల రేట్లు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతోందనే విమర్శలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. పాలనను పక్కకు పెట్టి.. కేసీఆర్ మద్యం అమ్మకాలపై దృష్టి సారించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే.. అలాంటి విమర్శలకు అద్దం పట్టేలాగే కేసీఆర్ నిర్ణయాలు కూడా ఉన్నాయంటున్నారు విమర్శకులు.
కాగా. త్వరలోనే లిక్కర్ ధరలు, ముఖ్యంగా బీర్ల ధరలను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు వచ్చాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బీర్ల ధరలు తగ్గించి.. సేల్స్ పెంచే దిశగా అబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
కేసీఆర్ ప్రభుత్వం ఆమోదం వస్తే కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఎండాకాలం కొనసాగుతుండటంతో.. మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగడానికే మొగ్గు చూపుతారనే ఆలోచనతో ధరల తగ్గింపుపై నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఒక్క బీరుపై రూ.20 తగ్గిస్తే.. సేల్స్ విపరీతంగా పెరుగుతాయని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు లిక్కర్ ఒక్కో బాటిల్ పై పది రూపాయలు తగ్గించేందుకు అధికారులు సన్నద్ధం అయినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వ అధికారిక ప్రకటన చేయనుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.