జగన్ సర్కార్ జీవో నెంబర్ 1 పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఓ మూర్ఖ ముఖ్యమంత్రి చేతిలో రాష్ట్రం నలిగిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ.. రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ జీవో నెంబర్ 1 ను సవాల్ చేస్తూ హైకోర్టుకు పోతే గతంలో స్టే ఇచ్చిందని, తీర్పు వచ్చే వరకైనా ప్రభుత్వం ఈ జీవో అమలును నిలువు చేయలేదని ఆయన మండిపడ్డారు. యుటీఎఫ్ టీచర్లు గన్నవరంలో ప్రైవేటు స్థలంలో ధర్నా చేస్తే.. ప్రభుత్వం అరెస్టులతో అడ్డుకుందన్నారు.
సీఎం జగన్ ఎవర్ని లెక్క చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన రెండు రోజులు ప్రశాంతంగా జరిగిందని, మూడో రోజు మాత్రం అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు.
అపపర్తిలో చేతగాని దద్దమ్మల్లా అధికార పార్టీ వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. పోలీసులు ఖాకీ డ్రెస్ వేసుకున్న పక్కా జీతగాళ్లని, ఐపీఎస్ అధికారులు జగన్ కు జీతగాళ్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.త్వరలో ఈ జీవో కు వ్యతిరేకంగా చేపట్టనున్న ర్యాలీలో భారీ స్థాయిలో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.