మల్కాజ్ గిరిలో చెరువులకు, నాలాలకు కంచెలు కట్టే విషయంలో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యధోరణి చిన్న పిల్లల పట్ల శాపంగా మారుతుంది. మల్కాజ్ గిరిలోని నాలాలో పడి సుమేధా అనే చిన్నారి చనిపోయిన ఘటన మర్చిపోక ముందే మరో బాలుడు మల్కాజిగిరి చెరువు ఆవరణలో శవమై తేలాడు.
ఇక వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 12 గంటలకు ఇంటి నుంచి బయటికెళ్లిన యువాన్ అనే బాలుడు కనిపించకపోవడంతో అతడి తండ్రి మహేష్ మల్కాజ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. యువాన్ సగం కాలిన మృతదేహం మల్కాజ్ గిరి చెరువు గట్టున కనిపించింది. అయితే కనీసం మాటలు కూడా సరిగ్గా రాని మానసిక వికలాంగుడైన యువాన్ ఇంటి నుంచి అదృశ్యమై ఇలా శివారులో ఉన్న చెరువు గట్టున శవమై తేలడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇక చెరువుకి ఏర్పాటుచేసిన కంచె తొలగించి ఉండటం కారణంగానే యువాన్ అటువైపు వెళ్లి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ యువాన్ శరీరం సగానికి పైగా కాలిపోయి ఉండటం కారణంగా పలు అనుమానాలకు దారితీస్తోంది. నాలాలకు, చెరువుకి కంచె ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులదే. కానీ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడం కారణంగానే గతంలో సుమేధా నాలాలో పడి చనిపోగా ఈ రోజు యువాన్ కూడా చెరువు దగ్గర శవమై దొరకడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
ఇక యువాన్ చిన్నప్పటి నుంచి మానసిక వికలాంగుడని.. మాటలు కూడా రావని.. అతను ఇలా చెరువు ఆవరణలో సగం కాలిన స్థితిలో దొరకడం స్థానికులలో విషాదాన్ని నింపింది. మరో వైపు కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని యువాన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇకనైన చెరువుతో పాటు నాలాలకు కంచెలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే పోలీసులు.. బాలుడి మృతదేహం సగం ఎలా కాలిందనే విషయం పై విచారణ చేపట్టారు.