పెద్దయ్యాక ఏం అవుతావని చిన్న పిల్లలను అడిగితే పోలీస్ అవుతా అని చెప్తుంటారు. కానీ.. పోలీస్ స్టేషన్ వైపు చూడాలంటే భయపడుతారు. కానీ.. ఓ పిల్లవాడు తనను స్కూల్ లో సార్ కొట్టాడని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండల కేంద్రంలోని ఓ ఫ్రైవేట్ స్కూల్ లో అనిల్ అనే విద్యార్ధి 2వ తరగతి చదువుతున్నాడు. అయితే.. స్కూల్ కు వెళ్లిన తనను టీచర్ కావాలనే కొట్టాడని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.
తనను కొట్టిన స్కూల్ టీచర్ పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాలుడు. ఆశ్చర్యపోయిన స్థానిక ఎస్ఐ రమాదేవి.. నిన్ను సారు ఎందుకు కొట్టాడు.. నువ్ ఏం చేశావు అని ప్రశ్నించింది. అందుకు దీటుగా సమాధానాలు చెప్పాడు బాలుడు.
బాలుడి ఫిర్యాదు మేరకు విచారణ చేప్పట్టినట్టు ఎస్ఐ తెలిపారు. బుడతడి ధైర్యాన్ని ఆమె మెచ్చుకున్నారు. ఇంత చిన్న వయసులో దైర్యంగా మాట్లాడుతున్న బాలునికి మంచి భవిష్యత్తు ఉంటోందన్నారు ఎస్ఐ రమాదేవి.