మహిళలు ధరించే దుస్తులపై ఎప్పుడూ ఎవరో ఒకరు కామెంట్లు చేస్తూనే ఉంటారు. వారు ధరించే దుస్తులు బాగాలేవని, మంచి దుస్తులను ధరిస్తే వారిపై అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయని.. ఇలా చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేశారు. అయితే కెనడాలోని ఓ స్కూల్‌లో మాత్రం ఏకంగా ఓ విద్యార్థినినే స్కూల్ నుంచి ఇంటికి పంపించేశారు. ఆమె ధరించిన దుస్తులు లో దుస్తులను పోలి ఉన్నాయని చెప్పి ఆమెను ఇంటికి పంపేశారు.
కెనడాలోని నోర్‌కామ్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో 17 ఏళ్ల ఓ విద్యార్థినిని మంచి దుస్తులు ధరించలేదని ఇంటికి పంపేశారు. ఆమె ధరించిన దుస్తులు లో దుస్తులను పోలి ఉన్నాయని, దీని వల్ల ఆమెను చూస్తే ఇతరులకు ఇబ్బందిగా అనిపిస్తుందని, కనుక మంచి దుస్తులు ధరించి రావాలని ఆమెను ఇంటికి పంపేశారు. స్కూల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు ఇద్దరూ ఆ పని చేశారు.
అయితే ఆ విద్యార్థిని తండ్రి క్రిస్టొఫర్ విల్సన్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అన్నాడు. తన కుమార్తె పట్ల అలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. మరోవైపు ఆ విద్యార్థినికి తోటి విద్యార్థులు కూడా మద్దతు పలికారు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం కలగజేసుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసింది. ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీంతో గొడవ సద్దుమణిగింది.