మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో గుడిసెల కూల్చివేతతో పేదల పరిస్థితి దయనీయంగా మారింది. గత 15 ఏండ్లుగా పేదలు గుడిసెల్లో జీవనం సాగిస్తుండగా.. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూల్చివేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు.
నిరుపేదలకు డబుల్ బెడ్రూం కట్టిస్తాం.. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అంటున్న సీఎం కేసీఆర్.. కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, వారు నివాసముంటున్న గుడిసెలను కూల్చివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 30వ వార్డు సర్వేనెంబర్ 119లో గత 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం తమకు భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చినప్పటికీ.. ప్రస్తుత టీఆర్ఎస్ సర్కారు సొంత లాభం కోసం అమానుషంగా తమ గుడిసెలను కూల్చివేశారంటూ బాధితులు వాపోయారు. స్థానిక మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి పేరుతో పేదల స్థలాలను గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవి శ్రీరంగనీతులు.. కూల్చేవి పేదల గుడిసెలు అన్న చందంగా మారింది. ఓవైపు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్తూనే ఉన్న నివాసాలను కూల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణమే స్పందించి పేదలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.