దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే.. శనివారం మరింత తీవ్ర స్థాయిలో ఎండలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని చోట్ల ఇవాళ 46 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఐఎండీ పేర్కొన్నది. సఫ్‌దార్‌జంగ్ అబ్జర్వేటరీ వద్ద శుక్రవారం అత్యధికంగా 42.5 డిగ్రీలు నమోదైనట్టు వెల్లడించింది.
ఇక నజఫ్‌గర్‌లో శుక్రవారం అత్యధికంగా 46.1 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు స్పష్టం చేసింది. జఫార్‌పూర్, ముంగేశ్‌పూర్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీలు నమోదు కాగా.. ఢిల్లీలోని పీతాంపురలో రికార్డు స్థాయిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు ప్రకటన విడుదల చేసింది.
వచ్చే వారం మబ్బులు నిండిన ఆకాశం, చిరు జల్లుల వల్ల కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది వాతవరణ శాఖ. ఈ ఏడాది వేసవిలో ఇది అయిదో హీట్‌వేవ్ గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చిలో ఓసారి భారీ ఎండలు కొట్టాయని.. ఆ తర్వాత ఏప్రిల్‌లో మూడుసార్లు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వెల్లడించింది.