రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగమండుతున్నాడు. భగ్గుమంటున్న ఎండలతో బయట అడుగు వేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ లో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 43.4 డిగ్రీలు, నిజామాద్ రూరల్ 42.1, నిజామాబాద్ డిచ్పల్లిలో 41.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండ తీవ్రతకు ప్రజలెవరు బయటకు రాకపోవడంతో.. ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులకు తప్పితే జనాలు బయటకు రాకపోవడం గమనార్హం.
మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగాయంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ లో ఆదివారం రాత్రి గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నిజామాబాద్ లలో 27, హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలలో 26, దుండిగల్ లో 25, హన్మకొండలో 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించారు.
సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో పగటి పూట ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. అయితే.. కరోనా కంటే భమంకరంగా ఎండలు తయారయ్యాయంటున్నారు ప్రజలు. కరోనా కాలంలో అయినా బయటకు వచ్చాం కానీ.. ఈ ఎండలకు బయటకు రావాలంటే భయంగా ఉందంటున్నారు.