రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. అప్పుడే.. నడి వేసవికాలంలా ఎండలు మాడు పగులగొడుతున్నాయి. గురువారం పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలుగా నమోదయ్యాయి.
చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. గరిష్టంగా పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, జగిత్యాల, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలు మండిపోతున్న క్రమంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. అటు ఏపీలోనూ ఎండాకాలం ప్రభావం మొదలైంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు గరిష్టంగా 39 డిగ్రీల సెంటిగ్రేడ్ కు చేరాయి.
రాత్రి 8 గంటలైనా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు భయపెడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ వేడి మొదలవుతోంది.