దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించాకే తదుపరి విచారణ చేపడుతామని సీజేఐ బెంచ్ పేర్కొంది. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై ఆరోపణలు వెల్లువెత్తడంతో 2019 డిసెంబర్ లో సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.
దాదాపు 47 రోజుల పాటు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన కమిషన్.. అప్పటి సీపీ సజ్జనార్, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీతో పాటు.. పలువురు పోలీసు అధికారులను ప్రశ్నించింది. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారి కుటుంబాల వాంగ్మూలాలు సేకరించింది. విచారణ పూర్తైన తర్వాత సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది.
అయితే.. కరోనా కారణంగా దర్యాప్తు ఆలస్యమైందని కోర్టుకు తెలపగా.. కేసు విచారణలో జాప్యాన్ని ఏ మాత్రం అంగీకరించమని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ఈ కేసులో మధ్యంతర దరఖాస్తుల స్వీకరణకు పైతం నిరాకరించారు.
2019 డిసెంబర్ 6న దిశ అత్యాచార కేసులో నిందితులైన నలుగురు పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. విచారణ సమయంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ చేసినట్లు అప్పటి సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే.. అది ఫేక్ ఎన్ కౌంటర్ అన్న విమర్శలు వెల్లువెత్తడంతో నిజనిర్థారణ కోసం సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన కమిటీ 57మంది సాక్షుల వాంగ్మూలాలను నివేదికలో పొందిపరిచింది.