వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని ఆయనకు సర్వోన్నత న్యాయ స్థానం సూచించింది.
ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నర్సింహాలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్బంగా ఎంపీకి ధర్మాసనం కీలక సూచనలు చేసింది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సూచించింది. దీంతో పిటిషన్‌ను విచారించేలా హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆదేశించాలని అవినాష్ తరఫు న్యాయవాది కోరారు. పూర్తిస్థాయిలో విచారించి తుది ఉత్తర్వులిచ్చేలా ఆదేశించాలని అభ్యర్థించారు.
కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. గత నెల 24న సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల తర్వాత ఎన్నిసార్లు సీబీఐ ముందు హాజరయ్యారని ధర్మాసనం ప్రశ్నించింది. అరెస్టు చేయకుండా సీబీఐ తాత్సారం చేస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత 3 సార్లు సమన్లు జారీచేశామని వైఎస్ సునీత తరఫున న్యాయవాది తెలిపారు. కానీ ఒక్క సారి కూడా సీబీఐ విచారణకు అవినాష్ హాజరు కాలేదని వాదించారు. నిన్నటి కర్నూలు ఘటనలను కూడా ధర్మాసనం దృష్టికి ఆయన తీసుకు వెళ్లారు.
అనంతరం ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని ఆయనకు ధర్మాసనం సూచించింది. ఆ బెయిల్‌పై ఈ నెల 25న విచారణ చేపట్టి ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టును ధర్మాసనం ఆదేశించింది. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్‌పై విచారణ పూర్తి అయ్యే వరకు తనపై సీబీఐ ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఆదేశించాలన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసి పుచ్చింది.