దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే సిర్పూర్కస్ కమిషన్ నివేదికలను ఇరు వర్గాలకు అందించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అందుకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం తరుఫు న్యాయవాది స్పందిస్తూ.. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయవద్దని కోర్టుకు విన్నవించారు.
ఆయన లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమ అభ్యంతరాలను హైకోర్టు ముందుంచాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు ఉన్నత న్యాయస్థానం సూచించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను దాచాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం, పిటిషనర్లు ఇరువురికి సాఫ్ట్ కాపీలు ఇవ్వాలని ఇవ్వాలని ఆదేశించింది.
ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసును తాము ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేసు తదుపరి విచారణ, తీసుకునే చర్యలపై హైకోర్టే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న ధర్మాసనం.. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక హైకోర్టుకు పంపుతామని తెలిపింది.
Advertisements
కమిషన్ నివేదికను సీల్డ్ కవర్‌లోనే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. ఈ విజ్ఞప్తిన తిరస్కరించిన న్యాయస్థానం.. నివేదిక గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొందరు తప్పుచేసినట్టు తేలిందని.. దానిని ప్రభుత్వం పరిశీలించాలని న్యాయస్థానం పేర్కొంది. రిపోర్టు వచ్చిందంటే దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తేల్చిచెప్పారు.