- క్షీణించిపోతున్న శాంతిభద్రతలు
- ఆందోళనలతో అట్టుడుకుతున్న తెలంగాణ
ఓవైపు రాష్ట్రంలో మితిమీరిపోతున్న అరాచకాలు.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు.. ఇంకోవైపు డైవర్ట్ రాజకీయాలతో అయోమయంలో ప్రజలు.. ఇది తెలంగాణలో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న అస్థిరతకు కారణం ఎవరు..? అరాచకాలు, ఆందోళనల వెనుక ఎవరున్నారు..? విపత్కర పరిస్థితుల్లో కూడా అధికార యావతో ప్రజలను మభ్యపెడుతున్నదెవరు..? నేడు ఇలాంటి అనుమానాలు తెలంగాణ ప్రజల్లో నెలకొన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, మహిళలపై అఘాయిత్యాలు, ఆందోళనలు వరుసగా చోటు చేసుకుంటుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై అత్యాచారంతో పాటు భాగ్యనగరం పరిసర ప్రాంతాల్లో వరుసగా అఘాయిత్యాలు చోటుచోసుకుంటుండంతో రాష్ట్రంలో రక్షణ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఘటనల్లో టీఆర్ఎస్ లీడర్ల ప్రమేయం ఉందనే వాదనలు వినిపిస్తుండటంతో గులాబీ పార్టీలో తీవ్ర స్థాయిలో అస్థిరత నెలకొంది. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏడు రోజులుగా తమ సమస్యలపై గళమెత్తుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల గేట్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హామీ ఇస్తే తప్ప పోరాటం ఆపబోమని వారు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో వరుస ఆందోళనలు, అరాచకాల పర్వంతో టీఆర్ఎస్ సర్కారు అప్రతిష్టపాలవుతోంది. తెలంగాణలో వివిధ వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై వరుస ఆందోళనలతో ఇరుకున పెడుతుండటంతో అధికార పార్టీ పాలుపోని స్థితిలో మిన్నకుండిపోయింది. ముఖ్యంగా అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వ అసంబద్ధ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై బిజెపి పోరుయాత్ర చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అయోమయ స్థితిలో పడిపోయింది.
మొత్తానికి సంక్లిష్ట పరిస్థితులతో చిత్తవుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే తరుణంలో ప్రజా వ్యతిరేత నుంచి పార్టీని గట్టెక్కించాలనే ఉద్దేశంతో రాజకీయ వ్యూహకర్త పీకేను ఫీల్డ్ లోకి దించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంను పావుగా వాడుకుని ఆందోళనలకు తెరతీసినట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంసం వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం హస్తముందని బిజెపి, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ఆలోచనలో భాగంగానే సాయుధ బలగాల నియామకాల కోసం తీసువకువచ్చిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనకు తెరతీశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్‌లో చేసిన ఆందోళనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావు నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విధ్వంసంలో సుబ్బారావు పాత్ర ఉందని భావించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి మూడు రోజుల నుంచి పలు కోణాల్లో గోప్యంగా విచారిస్తున్నారు. ఇదే కేసపులో అరెస్టయిన పలువురు యువకులు చంచల్‌గూడ జైళ్లో ఉన్నారు. మొత్తానికి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిగితే ఆందోళనల కుట్రదారులెవ్వరనేది తెలిసే అవకాశముంది.