తరచుగా విధులకు డుమ్మా కొడుతున్న డీఈవోకు జిల్లా కలెక్టర్ ఝలక్ ఇచ్చారు. డీఈవో లేని కార్యాలయానికి తాళాలు వేయించారు. అసలేం జరిగిందంటే…
భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నారు. ఈ విషయం కలెక్టర్ బవేశ్ మిశ్రా దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన డీఈవో కార్యాలయానికి తాళాలు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ డీఈవో కార్యాలయానికి తాళం వేశారు.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు అవుతున్నారని కలెక్టర్ దృష్టికి రావడంతో… కార్యాలయానికి తాళం వేయాలని జిల్లా పాలనాధికారి ఆదేశించారు. దీనితో స్థానిక తహసీల్దార్ చర్యలు తీసుకున్నారు. అదే క్రమంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం డీఈఓకు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ నాయకులు.. డీఈఓ లేకపోవడంతో తాళం వేసిన కార్యాలయ తలుపు వద్ద వినతి పత్రం ఉంచారు.
విద్యాశాఖ అధికారి విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో ఆగడాలు పెరిగిపోయాయని ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ నాయకులు ప్రవీణ్ అన్నారు. ఫీజుల నియంత్రణ లేకపోవడంతో అధిక ఫీజులు వసూలు చేస్తూ పిల్లలను, తల్లిదండ్రులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని.. జిల్లాకు శాశ్వత విద్యాశాఖ అధికారిని నియమించాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డీఈఓను సస్పెండ్ చేయాలని కోరారు.